మనిషి- ప్రత్యేకమైనవాడు!!!

ఈ మనిషి అనే జీవి సృష్టిలో ఉన్న సకల చరాచరజీవుల్లో ప్రత్యేకతలున్నవాడు- మిగిలిన జీవుల్లా కాదు!

నిత్యం ఓ వస్తువునో, ఓ కోరికనో కోరుతూనే ఉంటాడు,వాడి కోరికలు ఎలా ఉంటాయంటే, నిత్యం ఊటలు ఊరే ఏటిగట్టునుండే “చలమల్లాగా”- అసలు ఇంకిపోవడం అనేదే ఉండవు- చలమలు-వాటిలో నీళ్లు!

ఒక కోరిక కోరి, అది తీరేంతవరకూ-అది వస్తువయితే అర్రులు చాచటమే,ఎప్పుడు వస్తుందా అనో, ఎప్పుడు కొంటానా అనో నిత్యా పారాయణే దానిగురించి,ఏ “లలితా సహస్రనామాలో, విష్ణు సహ్రస్రనామాలో” కూడా అంత శ్రద్ధగా చేయడు; చివరాఖరికి ఆ వస్తువుని చేజిక్కుంచుకుంటాడు.ఎవరెస్టు ఎక్కినంత సంబరపడతాడు (కింద నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ఉన్న ఇరవైమూడు మెట్లు మాత్రం ఎక్కలేడు- లిఫ్ట్ కావాలి దానికి)

ఆ వస్తువు మీద వ్యామోహం తీరడానికి ఆట్టే సమయం కూడా పట్టదు- వాంటెడ్ లిస్టులో ఉన్న కొత్తవస్తువుకి టిక్కు పెట్టేయడం,ఇంక దానికోసం తపస్సు మొదలు. మరి ఇంతకుముందు కొన్న వస్తువుకి ఇదే తపన కదా-అప్పుడే దాని విలువ పోయిందా, వ్యామోహం పోయిందా-కొత్త మోజు తీరిపోయింది- “కొత్త చీపురు ముందు బాగా ఊడుస్తుంది” అంటారే అలాగన్నమాట-కొంతకాలానికి పాత పడిపోతుంది. కొత్త వస్తువుకు తపస్సు- అది ఫలించడం, దానిమీద పడ్డ కోరిక తీరడం, కొన్నాళ్ళకి దానిమీద మోజు తీరడం- దాదాపుగా చివరి మజిలీ వరకూ అందరు మనుషులదీ ఇదే తంతు -ఎవరో కాస్త తృప్తి, వివేకం ఉన్నవాళ్లు తప్ప!

దీనికి అంతేలేదు,వాడి అంత్యదశ వరకూ- పోనీలే పాపం కదా కష్టపడి సంపాదించాడు వీటిల్ని కూడా ఆ జీవితో తీసుకెళ్లనిద్దాం అనే స్పృహ భగవంతుడికి ఉందా అంటే- ఆయన అంతే.ఈ మానవుల్ని సృష్టించి వీటన్నిటి మధ్య పడేసి, సంపాదించండి,వీటిని కొనుక్కోండి అని చెప్పింది ఆయనే.చివరాఖరికి వీటిని తీసుకెళ్లడానికి “నిబంధనలు” ఒప్పుకోవు అంటాడు- ఇదేమి న్యాయం, ఇదేమి ధర్మం.

పైపెచ్చు “అయినా అవన్నీ మీకు చెప్పిన తర్వాతే ఇక్కడికి పంపించా, ఇప్పుడు నామీద నెపం వేస్తే ఎలా” అంటాడు.ఎక్కడో పైలోకంలో ఎప్పుడో చెప్పినవి మనకు ఏం గుర్తుండి చస్తాయి ఇన్ని సమస్యలతో ఇక్కడ సతమతం అవుతుంటే!

ఈ మాటే పోయినవారం మాముచ్చట్ల మధ్యన అడిగేసా కూడా ఉండబట్టలేక! అయన కొద్దిగా జాలిగా చూసాడు నా వైపు- “నువ్వు అడిగింది ధర్మమే- కానీ ఇబ్బడిముబ్బడి పెరిగిపోయే ఈ జనాభా- ఈ రాకపోకలతోనే రద్దీ పెరిగిపోయింది- వచ్చే పోయే మనుషులతోనే; ఇక ఈ వస్తువుల్ని కూడా అక్కడికి అనుమతిస్తే అక్కడ స్థలం ఎంతవున్నా చాలదుగా” అని ఆయన గోడు వెళ్లబోసుకున్నాడు నాతో - చెప్పొద్దూ- చచ్చేంత జాలేసింది దేవుడి మీద.ఓదార్పుగా “ఊరుకోవయ్యా” అన్నా నేను.

ఓక్షణం ఆగి ఓ రహస్యం చెపుతా నీకు అన్నాడు “అసలు ఈ మనుషులందరూ ఇక్కడ వదిలేసిన వస్తువులకు- మరికొన్ని కలిపి (వాళ్ళు చేసే మంచిపనులు చూసి) వాళ్లందరికీ రాబోయేజన్మలో మళ్ళీ ఇస్తున్నాకదా- ఇవి నేనిచ్చేవే కదా లేకపొతే వీళ్ళకి అప్పనంగా వాళ్ళ ప్రతిభకి దొరుకుతున్నాయా ఏమిటి” అన్నాడు!

“చిక్కు ఎక్కడఅంటే- వీళ్ళకి గత జన్మ గుర్తు ఉండదు కాబట్టి-ఇవన్నీ గుర్తుఉండవు (నేను పాత మెమరీ కార్డు తీసి పంపుతా కదా) అందుకని ఇలా అనుకుంటూ ఉంటారు.ఈ విషయం నువ్వయినా చెబుతావని నీ చెవిన వేసా” అన్నాడు.

నేను అన్నా “మంచి పని చేసావు ఇది చెప్పి-లేకపొతే నేను కూడా వీటన్నిటిని ప్యాకింగ్ చేయించి నాతో ఎలా తీసుకురావడం అని ఆలోచిస్తున్నా” ఆయనతో.

“నువ్వూ ఏం తీసిపోలా-అందరిలాగే నువ్వూనూ” అన్నాడు “అలా కాదు స్వామీ ఏదో మీతో కాస్త పరిచయం ఉంది కదా అందుకని” అని నసిగాను!

“నీలాంటివాళ్ళు చాలామంది ఉన్నారు-నువ్వొక్కడివేకాదుగా- కాకపొతే మీలాంటివాళ్ళకి ఓ సౌకర్యం కల్గిస్తా- వచ్చే జన్మలో మీ పాత మెమరీకార్డులో ఉండే కొన్ని విషయాలు ఉంచేస్తా.దానితో మీకు అవగాహన ఉంటుంది మన పరిచయం, మన సంభాషణలూనూ-మనిద్దరిమధ్య అపోహలూ, అపార్ధాలు ఉండవు” అన్నాడు.

“కాస్త పూర్వజన్మపు మంచివాసనలు తెలుస్తాయి కనుక- మీ ఆధ్యాత్మిక స్థాయి ఇంకొద్దిగా పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు.నాకూ ఉంటుంది కదరా తొందరగా మీరందరూ నాలో కలిసిపోవాలని-ఎప్పుడూ నాలోనే మీరంతా ఉండాలని-నాకు ఇలాంటి కోరికలు ఉంటుంటాయి” అని నవ్వాడు!

“ఆ మాత్రం చాలు స్వామి ఈ సామాన్లన్నీ ఇక్కడే వదిలేస్తా- నీ దగ్గరకి వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాక అన్నీ కొత్తవి కొనుక్కుంటా, అలాగే ఇంకొన్ని సామాన్లు కూడా ఇస్తావుగా వీటితోబాటు,అక్కడికి ఇవి తీసుకెళ్లే బెడద కూడా తప్పింది- ఈ పాత సామాన్లు నాకెందుకు, కొత్త శరీరం- కొత్త సామాన్లూనూ” అన్నాను నవ్వుతూ ఉత్సాహంగా!

“నువ్వు తక్కువవాడివి కాదురా” అన్నాడు వెళ్లేముందు నవ్వుతూ!! అయన అలా వెళ్ళాడు, నేను నిద్రకి ఉపక్రమించాను-నేనూ ఆయనా ఇలా తరచుగా కబుర్లాడుకుంటాం అనే సంగతి మా ఆవిడకి కూడా తెలియదు- రహస్యం కదా ఎంతైనా!

అదర్రా సంగతి, అంచేత మీరు కొనుక్కున్నవన్నీ శుభ్రంగా ఇక్కడే వాడుకోండి- అక్కడికి తీసుకెళ్లడం కుదరదు- మళ్ళీ వచ్చినప్పుడు కొత్తవి కొనుక్కోవచ్చు- ఇంకా చాలా ఇస్తా అంటున్నాడుగా ఆయన- ఏమంటారు!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!